తెలంగాణా రాష్ట్రంలో లాక్డౌన్ను మే 7వ తేదీ వరకూ పొడగిస్తామని కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్లో సడలింపులు చేయటం, లాక్డౌన్ను పొడగించే అంశంపై వివిధ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ విషయంలో రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సడలింపులు ఉండవని, మే 7 వరకూ తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అధికారులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మే ఆరంభం నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని అన్నారు.
మే 5న మరోసారి పరిస్థితిని సమీక్షించి లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 20 తర్వాత వివిధ రాష్ట్రాలు వారి ఇష్టాల మేరకు రాష్ట్ర పరిస్థితులను బట్టి లాక్డౌన్లో సడలింపులు చేసుకునే వెసలుబాటు ఉంటుంది. అయితే, తెలంగాణాలో కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర పరిస్థితులను బట్టి సడలింపుల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది, అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే లాక్డౌన్లో సడలింపులు చేయటం అంత శ్రేయస్కరం కాదని కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. గతంలో ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు అలాగే కొనసాగుతాయన్నారు. మే 1 తర్వాత కేసులు తగ్గుతాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.