లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మందు బాబులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే యూట్యూబ్ వీడియోలో చూసి హైదరాబాద్కు చెందిన తల్లీ కొడుకులు ఇంట్లోనే మద్యం తయారు చేస్తూ పోలీసులకు చిక్కారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ చర్చికాలనీలో నివాసముంటున్న పొలిశెట్టి సుధాకర్ అనే వ్యక్తి తన తల్లి తెరిహమ్మతో కలిసి ఇంట్లోనే మద్యం తయారీని ప్రారంభించాడు. ఇంటర్నెట్లో మద్యం తయారీ గురించి ఆరా తీసి, యూట్యూబ్లో వీడియోలు చూసి మద్యం తయారీ చేపట్టారు.
ఇంటి నుంచి విచిత్రమైన వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల నుంచి 25 లీటర్ల మద్యం తయారీకి కావలసిన ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.