కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటిస్తున్న తరుణంలో, మద్యం దుకాణాలు గత నాలుగు వారాలుగా మూతపడిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మద్యానికి బానిసలైన మందుబాబుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు. మందు దొరక్క ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య నానాటిక పెరుగుతోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నలిపోగు నరేశ్ (30) తాగుడుకు బానిసై, లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క పోవటంతో పెట్రోల్‌లో శానిటైజర్ కలుపుకొని తాగి మృతి చెందాడు. స్థానికులు కథనం ప్రకారం నరేశ్ ఈరోజు ఉదయం ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిసరాలను గమనించగా.. నరేశ్ ఇంట్లో ఉన్న శానిటైజర్‌ను పెట్రోల్‌లో కలుపుకొని తాగినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.