కరోనా కట్టడి కోసం పాటిస్తున్న లాక్డౌన్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆటోరిక్షా డ్రైవర్లు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో, వారిని ఆదుకునేందుకు కేజ్రీవాల్ సర్కారు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా, అర్హులైన ఆటో డ్రైవర్ల ఖాతాలో నేరుగా రూ.5,000 జమ చేస్తున్నట్లు ప్రకటించింది.
మొత్తం 1 లక్షా 60 వేల ధరఖాస్తులు వచ్చాయని ఇందులో వారి అర్హతలను, ఆధార్ లింకులను పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకూ 23,000 మంది ఆటోరిక్షా డ్రైవర్ల ఖాతాల్లో రూ.5,000 చొప్పున జమ చేశామని, త్వరలోనే ఇతర ఆటో డ్రైవర్లకు కూడా వారి అర్హతలను తనిఖీ చేసి జమ చేస్తామని ఢిల్లీ రవాణా శాఖ పేర్కొంది.
దాదాపుగా మరో 20,000 ధరఖాస్తుదారుల ఆధార్ మరియు అకౌంట్ నెంబర్లను వెరిఫై చేశామని, వారికి కూడా ఏ క్షణమైన డబ్బులు డిపాజిట్ అవుతాయని రవాణా శాఖ అధికారి గెహ్లాట్ చెప్పారు. లైసెన్స్ వెబ్సైట్లో ధరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోపే డ్రైవర్ల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి.