అంతర్జాల దిగ్గజం గూగుల్, ఇప్పుడు ఆర్థిక సేవల రంగంలోనూ తన హవా చాటేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ ఇప్పటికే ఇంటర్నెట్ సేవలతో పాటుగా గూగుల్ పే వంటి డిజిటిల్ ఆర్థిక సేవలను అందిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, తాజాగా.. గూగుల్ స్వతగా ఓ స్మార్ట్ డెబిట్ కార్డును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం గూగుల్ అందిస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన గూగుల్ పే మొబైల్ వ్యాలెట్‌కు అనుసంధానంగా ఈ డెబిట్ కార్డును డిజైన్ చేయనున్నారు. ఇందులో భాగంగానే గూగుల్ సంస్థ ఇప్పటికే సిటీ బ్యాంక్‌తో ఓ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
గూగుల్ విడుదల చేయబోయే ఈ స్మార్ట్ డెబిట్ కార్డు రెండు రూపాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది భౌతికంగా వినియోగించే కార్డు. అంటే ప్రస్తుతం మన వివిధ షాపింగ్ మాళ్లలో వినియోగిస్తున్న క్రెడిట్/డెబిట్ కార్డుల మాదిరిగా ఉంటుంది.
ఇకపోతే రెండవది వర్చువల్ కార్డు. ఇది మనం ప్రస్తుతం వినియోగిస్తున్న గూగుల్ పే వంటి మొబైల్ పేమెంట్ తరహాలో ఉండబోతుందన్నమాట. కానీ.. గూగుల్ కార్డ్‌పై ఆ సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.