టామ్ అండ్ జెర్రీ కార్టూన్ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. చిన్నాపెద్దా అంటూ తేడా లేకుండా ప్రతి వయస్సు వారిని ఆకట్టుకున్న షో ఇది. పిల్లి, ఎలుక మద్య జరిగే సిల్లీ గొడవలను ఫన్నీగా చూపిస్తూ నీతి, స్నేహం, ప్రేమ తదితర సామాజిక అంశాలను బోధించిన కార్టూన్ ఇది. ఇలాంటి అద్భుతమైన పాత్రలను మనకందించిన టామ్ అండ్ జెర్రీ దర్శకుడు జీన్ డిచ్ కన్నుమూసారు.
జీన్ డిచ్కు 95 ఏళ్లు. ఈయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్లో ఎప్రిల్ 16 రాత్రే మరణించారు. కాకపోతే ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టామ్ అండ్ జెర్రీ షోలో 13 ఎపిసోడ్లకు డిచ్ దర్శకత్వం వహించారు. జీన్ డిచ్ మరణ వార్త విని టామ్ అండ్ జెర్రీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
జీన్ డిచ్ గతంలో అమెరికా వైమానిక దళంలో పని చేసేవాడు. ఆ తర్వాత 1959లో ప్రేగ్లో స్థిరపడ్డాడు. డిచ్కు చిత్ర కళలంటే ఎంతో ఇష్టం. ఆయన తీసిన మన్రో యానిమేషన్ చిత్రానికి అప్పట్లో మంచి ఆదరణ లభించింది, 1960లో బెస్టు యానిమేటెడ్ షార్ట్ ఫిలింగా ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టింది.