రాహుల్ పేరు మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ ప్రెస్మీట్లో దాదాపు అన్ని సందర్భంలోనూ జర్నలిస్ట్ రాహుల్ పేరు వినిపిస్తూ ఉంటుంది. రాహుల్.. అంటూ కేసీఆర్ విసిరే కౌంటర్లను కూడా ఇదివరకటి వీడియోల్లో చూసే ఉంటాం. ఆ రాహులే ఇండియాటుడే జర్నలిస్ట్. ఇప్పుడే అదే రాహుల్‌పై తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటీఆర్ కూడా సీరియస్ అయ్యారు.
రాష్ట్రంలో వైద్య సిబ్బందికి పిపిఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్)ల కొరత భారీస్థాయిలో ఉందంటూ ఇండియాటుడే ప్రచురించిన కథనంపై మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. అసలు ఈ విషయంలో వాస్తవాలు తెలియకుండా వార్తలు రాస్తున్నారు, ఇదేం జర్నలిజం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణాలో కేవలం 3,132 పిపిఈ కిట్లు మాత్రమే ఉన్నట్లు ఇండియాటుడే ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ గ్రాఫ్‌ను ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఇండియాటుడే జర్నలిస్ట్ రాహుల్ కన్వాల్. ఆ ట్వీట్ కాస్తా తన దృష్టికి రావటంతో కేటీఆర్ సీరియస్ అయ్యారు. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో, మీ వద్ద సరైన సమాచారం లేకపోతే ఇలాంటి చెత్త రిపోర్టులను ప్రచురించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం సరికాదని హెచ్చరించారు.
మీరు ప్రచురించిన దాని కన్నా రాష్ట్రంలో 100 రెట్లు ఎక్కువ పిపిఈ కిట్లు ఉన్నాయని రుజువు చేస్తే నువ్వు, మీ ఇండియాటుడే మాకు క్షమాపణలు చెబుతారా అంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. జర్నలిజానికే మచ్చతెచ్చేలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని, తెలంగాణాలో ప్రస్తుతం 3.6 లక్షలకు పైగా పిపిఈ కిట్లు ఉన్నాయని, మరికొద్ది రోజుల్లోనే మరో 6 లక్షలకు పైగా పిపిఈ కిట్లు రాష్ట్రానికి వస్తాయని కేటీఆర్ చెప్పారు. ఇలాంటి నిరాధారామైన నివేదికలను తక్షణమే తొలగించాలని ఆయన కోరారు.
Rahul, If you don’t have accurate data, don’t publish nonsense & confuse people in these troubling times
Will you & India today apologise if I prove that we have 100 times more PPEs than what you have projected here?
Sorry but this is disgraceful journalism @sardesairajdeep https://t.co/gPRHaQVVFU
— KTR (@KTRTRS) April 22, 2020