స్ట్రాబెర్రీని చూడగానే చాలా మందికి నోరూరుతుంది. రుచిలో కాస్తంత పుల్లగా ఉన్నప్పటికీ, జ్యూసీగా ఉండే ఈ అందమైన ఫ్రూట్లో అనేక పోషక విలువలు ఉన్నాయి. స్ట్రాబెర్రీని నేరుగా తినడం ఇష్టం లేని వారు, దాని ఫ్లేవర్ తెలియకుండా తియ్యగా సేవించడానికి వీలుగా దానిని అరటి పండుతో కలిపి ఓ చక్కటి మిల్క్‌షేక్ తయారు చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం రండి..!
కావల్సిన పదార్థాలు:
అరటి పండు – 1
స్ట్రాబెర్రీలు – 3 నుంచి 4
చల్లటి పాలు – అర కప్పు
పంచదార లేదా తేనె – తగినంత
ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ క్రీమ్ – కొంచెం
తయారు చేయు విధానం:
బాగా పండి అరటి పండును పండు తొక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, స్ట్రాబెర్రీలను కూడా కడిగి శుభ్రం చేసి కట్ చేసుకోవాలి. ఈ రెండు పండ్ల ముక్కలను బ్లెండర్లో కానీ లేదా జ్యూసర్ జార్లో కానీ వేసుకొని, కాస్తంత పంచదార లేదా తేనే కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి చల్లటి పాలను జోడించి, మరో నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి.
ఈ పానీయాన్ని చల్లగా సేవించాలనుకునే వారు బ్లెండ్ చేసే సమయంలో 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదా బ్లెండింగ్ పూర్తయిన తర్వాత చల్లటి ఐస్ క్రీమ్‌తో గార్నిష్ చేసుకొని కూడా సేవించవచ్చు.
ఈ మిల్క్‌షేక్‌ను సేవిస్తే కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్, కొంచెం బనానా ఫ్లేవర్‌తో భలే రుచిగా అనిపిస్తుంది. పిల్లలైతే దీనిని మరీ ఇష్టంగా సేవిస్తారు.