ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ వ్యాధి తీవ్రత ఇంక మనవాళ్లకి పూర్తిగా అర్థమైనట్లేదు. చాలా మంది కోవిడ్-19ను లైట్ తీసుకుంటున్నారు. వైరస్ మాకెందుకు వస్తుంది, మేము ఆరోగ్యంగానే ఉన్నాం కదా, మా ఊర్లో కరోనా లేదు, మా రోగనిరోధకశక్తి ఎక్కువ, మాకు కరోనా కన్నా ఇతర వ్యవహారాలే ముఖ్యం.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో వాదన.
కానీ.. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే, వీరంతా వైరస్‌పై తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణా రాష్ట్రంలో ఓ మహిళ ద్వారా 31 మందికి కరోనా వైరస్ సోకింది. ఇందుకు ఆమె చేసిందల్లా ఈ లాక్డౌన్ సమయంలో ఆమె తన ఇంటికే పరిమితం కాకుండా ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి వారితో అష్టాచమ్మా ఆట ఆడటమే.
ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి ద్వారా అప్పటికే ఆమెకు కరోనా సోకింది. ఆ విషయం గ్రహించని ఆమె కరోనా టెస్టులు చేయించుకోకుండా, సెల్ఫ్ క్వరెంటైన్లో ఉండకుండా ఇరుగు పొరుగుతో ఆటలాడికి అలా 31 మందికి వైరస్ అంటించింది. తెలంగాణలోని సూర్యాపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఆమెతో కాంటాక్టులో ఉన్న వారందరికీ పరీక్షలు చేయగా ఇప్పటి వరకూ 31 మంది తేలారు. వారందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరందరినీ హోమ్ క్వరెంటైన్లో ఉంచారు.