మొన్నామధ్య తెలంగాణలోని సూర్యాపేటలో ఒకావిడ అష్టాచమ్మ ఆడి 31 మందికి కరోనా వైరస్ వ్యాప్తి చేసిన సంగతి మరువక ముందే విజయవాడలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు లారీ డ్రైవర్లు పేకాట ఆడి మొత్తం 39 మందికి కరోనా అంటించారు. విజయవాడలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించారు.
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను పాటించకుండా, ఇరుగు పొరుగు వారితో పేకాట ఆడి ఇద్దరు లారీ డ్రైవర్ల నుంచి మొత్తం 39 మందికి కరోనా సోకింది. కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్ కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచి పేకాట/హౌసీ ఆటలు ఆడటంతో అతని ద్వారా 24 మందికి కరోనా సోకింది.
కార్మికనగర్లోని మరో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 15 మందికి కరోనా సోకిందని కలెక్టర్ వివరించారు. వృత్తిరీత్యా వివిధ రాష్ట్రాలకు వెళ్లొచ్చిన ఈ డ్రైవర్లకు మొదట్లో కరోనా లక్షణాలు కనిపించలేదు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా వారికి కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్ వచ్చింది. వారితో కాంటాక్టులో ఉన్న వారికి కూడా పరీక్షలు చేసిన తర్వాత వారిద్దరి ద్వారా మొత్తం 39 మందికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రజలు భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఈ రెండు ఉదంతాలూ జరిగాయని, ప్రజలు భౌతికదూరం పాటించకుంటే కరోనా నియంత్రణ చాలా కష్టమని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించారు. రెడ్జోన్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.