తమిళనాడు – చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో కరోనా కలకలం రేగింది. కుప్పం సరిహద్దు ప్రాంతంలోని వానియంబడిలో పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావటమే ఇందుకు కారణం. కరోనా కట్టడి చేసే పోలీసులకే కరోనా సోకడంతో కుప్పం ప్రజల్లో భయాందోళన నెలకొంది.
వివరాల్లోకెళితే.. కుప్పం సరిహద్దు ప్రాంతంలోని వానియంబడి తాలూకా పోలీస్ స్టేషన్లో మహిళా సీఐకు కరోనా సోకింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని పూర్తిగా మూసివేశారు. సీఐతో కాంటాక్టులో ఉన్న ఇతర పోలీసు అధికారులను క్వరెంటైన్కు తరలించి పరీక్షలు చేస్తున్నారు.
కాగా.. కరోనా సోకిన మహిళా సీఐను చికిత్స నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని 43 మంది సిబ్బందితో పాటు విలేకరులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా, చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 73 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 13 మంది డిశ్చార్జి కాగా, 60 మంది ప్రస్తుతం కరోనా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.