దాదాపు నెల రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రేబాల ప్రగతి నగర్ కాలనీకి చెందిన మహిళ వైరస్ నుంచి పూర్తిగా కోలుకోవటంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా చికిత్స తరువాత సంపూర్ణ ఆరోగ్యంతో ఆ మహిళ ఇంటికి రావటంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలో ఈమెకు కరోనా పాజిటివ్ అని రావటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రగతి నగర్ కాలనీ నుండి 3 కిలో మీటర్ల దూరం వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో బుచ్చిరెడ్డిపాళెం కూడా రెడ్‌జోన్ క్రిందకు రావటంతో ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కఠిమైన లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కరోనా వైరస్ సోకిన మహిళ కోలుకోవటంతో పాటుగా ఈ ఏరియాలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాని నేపథ్యంలో, రెడ్‌జోన్‌ను తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బుచ్చి మండలాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దుకాణాలన్నీ మూతపడటంతో పొలాల్లో రెండో పంట వేయడానికి అవసర మైన విత్తనాలు, ఎరువులు తెచ్చుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కరోనా కేసులు లేనందున దీనిని రెడ్‌జోన్‌కు బదులుగా ఆరంజ్ జోన్‌గా ప్రకటించి, వ్యవసాయ పనులు చేసుకునేందుకు వీలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.