కరోనా వైరస్ సోకిన వ్యక్తుల విషయంలో, వారి పేర్లు వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచాలని, ఎవరైనా వారి పేర్లు బయటకు చెప్పినా లేదా ఏ మీడియాలో బహిర్గంతంగా ప్రచురించినా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. అందుకే ఆస్పత్రులలో కూడా కరోనా రోగులను నెంబర్ల ఆధారంగా, అంటే పేషెంట్ నెంబర్ వన్, పేషెంట్ నెంబర్ టూ.. అంటూ వర్గీకరిస్తారు.
ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిమైన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా.. బెంగుళూరు నగరంలో ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంసమైంది. బెంగుళూరులోని విజయపుర జిల్లాకు చెందిన 24 ఏళ్ల అనిల్ తన వాట్సాప్ స్టేటస్‌లో కరోనా సోకిన అమ్మాయి ఫొటో పెట్టాడు. ఆ విషయం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
విజయపుర జిల్లాకు చెందిన ఓ అమ్మాయికి కరోనా పాజిటివ్ అని తేలడంతో, ఆ అమ్మాయి ఫొటోని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి, బ్యాడ్ న్యూస్ ఈమెకి కరోనా పాజిటివ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. సాధారణంగా వాట్సాప్ స్టేటస్ యూజర్ డిలీట్ చేయనంత వరకూ, 24 గంటల పాటు యాక్టివ్‌లో ఉంటుంది. తన ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నవారంతా ఆ అమ్మాయి గురించి చర్చ మొదలు పెట్టారు.
దీంతో ఈ విషయం ఆనోటా ఈనోటా చేరి పోలీసుల వరకూ చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ ఆధారంగా ఆ అబ్బాయి ఉండే ప్రాంతాన్ని గుర్తించి అరెస్టు చేశారు. వాట్సాప్ స్టేటస్‌ను డిలీట్ చేయించారు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. స్థానికంగా ఉండే వారికి విషయం తెలిసిపోయి, ఆ ప్రాంతంలో కరోనా కలకలం మొదలైంది.
గుర్తుంచుకోండి..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఏ వ్యక్తికైనా కరోనా సోకితే వారి పేర్లు, ఫొటోలు, వివరాలను బయటకు వెల్లడి చేయకూడదు. ఎవరైనా సరే, ఎంతటి హోదా వారైనా సరే ఇలాంటి విషయాలను బయటకు తెలియజేస్తే చట్టరీత్యా వారు శిక్షార్హులు అవుతారు.