ఆంధ్రప్రదేశ్లో మూడో విడత రేషన్ పంపిణీకి సర్వం సిద్ధమైంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో మేరకు ఉచితంగా పేదలకు మూడో విడత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి (ఏప్రిల్ 29) నుంచి రేషన్ పంపిణీ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు మళ్లీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రేషన్ పంపిణీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలుపై రెవెన్యూ అధికారులు, డీలర్లకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు.
రేషన్ పంపిణీ చేసే తేదీలు: బియ్యం కార్డు దారులకు ఏప్రిల్ 29 నుంచి మే 10వ తేదీ వరకూ ఉచిత సరుకుల పంపిణీ ఉంటుంది.
టైమ్ స్లాట్ టోకెన్: ప్రతి వినియోగదారునికి టైమ్ స్లాట్ టోకెన్ ఇస్తారు. ఒక్కో షాపులో రోజుకు 30 మందికి మాత్రమే సరుకులు పంపిణీ చేస్తారు.
బయోమెట్రిక్ తప్పనిసరి: మొదటి, రెండు విడతల్లో వినియోగదారుల బయోమెట్రిక్ లేకుండా వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించారు. కానీ మూడో విడతలో మాత్రం లబ్దిదారుల తప్పనిసరిగా బయోమెట్రిక్ వినియోగించాల్సి ఉంటుంది.
శానిటైజర్స్, మాస్కులు తప్పనిసరి: కరోనా కట్టడిలో భాగంగా అన్ని రేషన్ షాపుల దగ్గర శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉండాలి. బయోమెట్రిక్ వేయడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా శానిటైజర్ వాడాలి. రేషన్ షాపుల్లో ఖచ్చితంగా శానిటైజర్, మాస్కులను డీలర్లు అందుబాటులో ఉంచాలి. లేని పక్షంలో ప్రజలు నిలదీయవచ్చు. మొత్తం పంపిణీని ఆపేసి పోలీసులకు కంప్లైట్ చేయొచ్చు.
సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) తప్పనిసరి: రేషన్ తీసుకోవటానికి వచ్చే లబ్ధిదారులంతా తప్పనిసరిగా సమాజిక దూరం (సోషల్ డిస్టెన్స్), మనిషికీ మనిషికీ మద్యా దూరం పాటిస్తూ రేషన్ తీసుకోవాలి.