తిరుమల ఆలయం మూసివేతపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై టీటీడీ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మ కర్తల మండలితో చర్చించి తిరుమల శ్రీ వారి ఆలయంలో జూన్ 30వ తేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపి వేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది.
భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించే విషయంపై ధర్మకర్తల మండలి సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని, ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని టీటీడి పేర్కొంది.
కాగా.. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని మే 3వ తేదీ వరకూ నిలిపివేసిన సంగతి తెలిసినదే. దేశంలో మరోసారి లాక్డౌన్ను పొడగించినట్లయితే, అప్పటి వరకు కూడా ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, ఈ విషయంలో త్వరలోనే ఓ స్పష్టత ఇస్తామని టీటీడీ పేర్కొంది.