నాన్న, ఓ నాన్న !
నువ్వు ఎప్పుడు ఇంతేనా ! పల్లవి 1, 2
నీ జన్మంతా, నా గెలుపు కేనా !
నీవన్నది లేకుంటే, నేనన్నది నిజమవునా !
ప్రతి నిత్యం నాతోనే , నీవుంటావనుకున్న !
బాల్యం లో తెలియలేదు,
నీ భుజాలపై నేనున్నానని .
నీ పైనుంటే తెలియలేదు,
ఈ లోకం చుపిస్తున్నావని.
నాన్న, ఓ నాన్న !
బాల్యం లో తెలియలేదు,
నా నవ్వుల చిరునామా నువ్వని.
నా తప్పులు సవరిస్తున్నపుడు తెలియలేదు,
నా భవిత కు బాట వేస్తుందే నువ్వని.
నాన్న, ఓ నాన్న !
బాల్యం లో తెలియలేదు,
ఓ, న, మా, లు నేర్పిన,
నా తొలి గురువు నువ్వేనని.
నాన్న, ఓ నాన్న !
నడిచేప్పుడు తెలియలేదు,
నీ వ్రేలు పట్టకు నడుస్తున్నానని.
పరుగులు పెట్టేప్పుడు తెలియలేదు,
ఆ పరుగుల ప్రతినిధివి నువ్వని.
చదివేప్పుడు తెలియలేదు,
నా చదువుకు బీజాక్షరాలు వేసిందే నీవని.
పడినప్పుడు తెలియలేదు,
నా వెన్ను తట్టి లేపిందే నువ్వని.
నాన్న, ఓ నాన్న !
ప్రతి రూపాయి, లెక్కిస్తుంటే తెలియలేదు,
రేపటి రోజున, నీ రూపాయిలే,
నా జీవన భృతి రూపాలని.
నాన్న, ఓ నాన్న !
ఖర్చు చేసేప్పుడు తెలియలేదు,
ఆ ఖర్చు వెనుక, నీ రెక్కల కష్టం దాగుందని
నాన్న, ఓ నాన్న !
నీతో గొడవలు పడి, గెలిచేప్పుడు తెలియలేదు
నువ్వెందుకు తగ్గుతున్నావని.
నాన్న, ఓ నాన్న !
గెలిచినప్పుడు తెలియలేదు,
నా గెలుపు కు మలుపువు నువ్వని.
నడవడిక లో తెలియలేదు,
ఆ నడత నేర్పిందే నువ్వని.
నాన్న, ఓ నాన్న !
యవ్వనం లో తెలియలేదు,
ఎగురుతున్న నన్నెందుకు,
ఆపుతున్నావా అని.
నాన్న, ఓ నాన్న !
జీవిత మనే చక్రం పై, తొలిఅడుగు వేశాక,
తెలియని సంద్రంలో, చిక్కుకు, పోతున్నాక,
సంసార, సాగరంలో పూర్తిగా మునిగాక,
సంబంధ, బాంధవ్యాలు పెరిగాక,
సమాజ నైజం తెలిశాక,
నాకంటూ ఓ ప్రపంచం ఏర్పడినాక,
ఇక అంతా నాదేనని,
ఇది అంతా నాకేనని.
ఇందులో నీదేమీలేదని,
ఇక నీతో నాకేంటని,
అనుకున్నాకే తెలిసింది. నాన్న…….
నేను నీ దారిలో నడుస్తున్నానని
నా నిజ జీవిత సత్యం నువ్వని……..
నాన్న, ఓ నాన్న !
నాన్న, ఓ నాన్న !
అనునిత్యం, నువ్ నాతో వున్నా,
నీ అంతర్మధనం తెలుసుకోలేకున్నా !
కానీ ఒక, ఆలస్యం తరువాతే తెలిసింది
అనునిత్యం, నా తప్పులను బరిస్తూ,
అనుక్షణం నా ఆవేశాన్ని సహిస్తూ,
అహర్నిశలు నా గెలుపుకు ప్రార్ధిస్తూ,
నాకోసం, నువ్వు ఓడావని.
నీ ఆనందం నాకై వదిలేసావని,
మన కుటుంబం కోసం కరిగే కొవ్వొత్తిలా మారావని.
తెలుసుకునేలోపే,
అంతులేని దూరంలో ఉన్నానని,
నాగమ్యం రాలేదని,
నే, నిను చేరే సమయం ఉందని తెలుసుకున్నా.
నీ విచ్చిన ధైర్యం తో,
నీ అడుగుజాడలలో , నడవాలని ఆశిస్తున్నా.
అందులకై నీ ఆశీస్సులు కోరుతున్నా !
ఈ పూర్తి రచన నాన్న లేని నాడు, తన విలువ తెలుసుకున్న ప్రతి కొడుకుకి అంకితం…