వీడియో కాలింగ్ యాప్ జూమ్ (ZOOM) సురక్షితమైనది కాదని, ఈ చైనా యాప్‌ని వాడొద్దని వార్తలు వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్‌లో ఇప్పుడు ఏకంగా ఒకేసారి 8 మందితో మాట్లాడే విధంగా ఓ ఫీచర్‌ని యాడ్ చేశారు.
వాట్సాప్ కొత్త అప్డేట్ ద్వారా ఈ ఫీచర్‌ను మీ ఫోన్లో కూడా పొందవచ్చు. వాట్సాప్ వీడియో కాలింగ్ ద్వారా ఇప్పటివరకూ గరిష్టంగా నలుగురితో మాత్రమే ఒకేసారి మాట్లాడుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇప్పుడు వాట్సప్ తాజాగా ఈ సంఖ్యను 8 కి పెంచుతూ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
”కరోనా నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాట్సప్ ద్వారా వాయిస్ లేదా వీడియో కాల్ చేయడం బాగా పెరిగింది. మరింత ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం కావాలని వినియోగదార్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో గతంలో ఉన్న గ్రూప్ వాయిస్, వీడియో కాల్ పరిమితిని రెట్టింపు చేశాం” అంటూ వాట్సప్ ఓ ప్రకటనలో పేర్కొంది.