చికెన్‌తో అనేక రకాల వెరైటీలు తయారు చేయవచ్చు. అలాంటి వెరైటీ రెసిపీలో చికెన్ వడ కూడా ఒకటి. మరి కరకరలాడే రుచికరమైన చికెన్ వడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..!
కావలసిన పదార్థాలు:
చికెన్ కీమా – అర కిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
మైదా (ఆల్ పర్పస్ ఫ్లవర్) – 2 టేబుల్ స్పూన్స్
మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లవర్) – 2 టేబుల్ స్పూన్స్
బియ్యపు పిండి (రైస్ ఫ్లవర్) – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టీ స్పీన్
ఘరం మసాలా పొడి – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
ఉల్లిపాయ – పెద్దది (సన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర – గుప్పెడు (సన్నగా కట్ చేసుకోవాలి)
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారు చేసే విధానం:
ముందుగా చికెన్ కీమాను (కీమా దొరకనట్లయితే, బోన్‌లెస్ చికెన్‌ను మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు) ఓ గిన్నెలోకి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఘరం మసాలా పొడి (చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు) మరియు ఉప్పు వేసి బాగా కలవనివ్వాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమంలోకి బియ్యపు పిండి (క్రంచీనెస్ కోసం), మైదా పిండి, మొక్కజొన్న పిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని గట్టి ముద్దగా ఉండేలా కలుపుకోవాలి.
ఈలోపుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, కాగనివ్వాలి. ఇప్పుడు ఈ వడ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, అరచేతిలో వడల మాదిరిగా అద్దుకొని మీడియం ఫ్లేమ్‌పై డీప్ ఫ్రై చేసుకోవాలి. వడలను రెండు వైపులా రంగు మారే వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే.. కరకరలాడే రుచికరమైన చికెన్ వడలు రెడీ.