ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. గడచిన వారం రోజుల్లో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లాలో కరోనా సోకి మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న అంశం కూడా చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ ఎవరికైనా సోకవచ్చు. అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చు. కరోనా సోకినవారిని అంటరానివారిగా చూడటం సరికాదు. బాధితులపై ఆప్యాయత, సానుభూతి చూపించాలి గానీ వివక్ష తగదు. అంతిమ సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం సరికాదు’ అన్నారు. ఎవరైనా అలా ప్రవర్తిస్తే తీవ్రంగా స్పందించాలని డీజీపీని సీఎం ఆదేశించారు.