దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మే 17 వరకూ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద ప్రజలు 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆయా దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది.
గ్రీన్ జోన్లలో బస్సులకు అనుమతి
దేశంలో లాక్డౌన్ను మే 17 వరకూ పొడగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో, గ్రీన్ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిరిగేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆరెంజ్ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్, సహాయకుడి సాయంతో బయటకు వెళ్లొచ్చు. రెడ్ జోన్లలో ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్ సెంటర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది, మిగతా అన్ని సేవలు మూసివేసే ఉంటాయి.