కరోనా మహమ్మారిని భారత్ నుంచి పూర్తిగా తరిమేసేందుకు గాను దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాస్తవానికి మే 3వ తేదీతో లాక్డౌన్ ముగియాల్సి ఉన్నప్పటికీ, దేశంలో కరోనా కేసులు తగ్గకపోవటంతో మే 17 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలో లాక్డౌన్ను పొడగించడం ఇది మూడోసారి. కాగా.. ఈ రెండు వారాల లాక్డౌన్లో అనేక మినహాయింపులు ఉండబోతున్నాయి. కానీ కరోనా వైరస్ ఎక్కువగా ఉండే రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని, ఆ ప్రాంతాల్లో యథాతధంగా లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది.
గ్రీన్, ఆరెంజ్ జోన్లనో మాత్రం కొంత వరకు ఆంక్షలను సడలిస్తారు. ఈ రెండు వారాల పాటు అన్ని జోన్లలో విమానాలు, మెట్రో, రైళ్లు ప్రయాణాలపై పూర్తిస్థాయి నిషేధం ఉంటుందని పేర్కొంది. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్లు, జిమ్స్, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
రెడ్ జోన్లలోనూ కొన్నంటికి మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించవచ్చు. కాగా.. వలస కార్మికులను తరలించే ప్రత్యేక బస్సులు, రైళ్లకు మాత్రం అనుమతి ఉంటుంది. దీనిపై ప్రధాని రేపు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.