కరోనా వైరస్ వ్యాప్తి మరియు నివారణ చర్యలు, లాక్డౌన్ కొనసాగింపు, జోన్లలో ఆంక్షల సడలింపు తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మే 2) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రసంగం ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, రేపటి ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మే 4వ తేదీ తర్వాత నుంచి మరో రెండు వారాల పాటు, అంటే మే 17 వరకు లాక్డౌన్ పొడిగించారు.
దేశంలో లాక్డౌన్ను ఇప్పటి వరకూ మూడు సార్లు పొడగించారు. తొలుత మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 విధించారు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించారు. ఇప్పుడు మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసినదే.