టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి కోసం అధికారులు తిరుమల ఆలయం తలుపులు తెరిచి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని కొంతమంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీటీడి పేర్కొంది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసిసి టీటీడీ, తాము 1,300 మంది పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగించామని వస్తున్న వదంతులను కూడా కొట్టి పారేసింది. ఈ ప్రచారమంతా పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
స్వామి వారికి సేవలు జరుగుతూనే ఉన్నాయి:
లాక్డౌన్ నేపథ్యంలో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో స్వామి వార్లకు సేవలు, పూజలు, కైంకర్యాలు ఆగమోక్తంగా ఏకాంతంగా జరుగుతూనే ఉన్నాయి. టీటీడీ పరిధిలోని ఆలయాల నిర్వహణను పర్యవేక్షించడం, పరిశీలించడం చైర్మన్ విధుల్లో ఒక భాగం. ఇందులో భాగంగానే చైర్మన్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. అధికారులతో అనేక విషయాలు చర్చించారు. అంతే కానీ చైర్మన్ కోసం ఆలయ తలుపులు తెరిచామని కొంత మంది ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవం.
నెలలో రెండు శుక్రవారాలు చైర్మన్ స్వామి వారి అభిషేక సేవలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. గత శుక్రవారం ఆయన పుట్టిన రోజు రావడం యాదృచ్చికం. ఆలయానికి ఆయన తన భార్య, తల్లి తో మాత్రమే వచ్చారు. ఫోటోలోని మిగిలిన వారంతా టీటీడీ ఉద్యోగులే. సనాతన ధర్మాన్ని , ఆచారాలను కాపాడటానికి పాలక మండలి, అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. టీటీడీ మీద ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం మంచిది కాదని టీటీడీ పేర్కొంది.
ఉద్యోగుల తొలగింపుపై ఇదీ అసలు వాస్తవం:
కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు సంబంధించిన టెండర్ గత నెల 30వ తేదీతో ముగిసింది. అంతే కానీ టీటీడీ వారిని తొలగించలేదు. వాస్తవం ఇలా ఉంటే మే 1వ తేదీన టీటీడీ 1,300 మంది పారిశుద్య కార్మికులను తొలగించినట్లు కొంత మంది వివిధ ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో అవాస్తవ ఆరోపణలు, ప్రచారాలు చేయడం బాధాకరం.
లాక్డౌన్ కాలంలో ఎలాంటి టెండర్ ప్రక్రియలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. లాక్డౌన్ ముగిశాక టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాం. అయినా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మానవతా హృదయంతో సదరు కాంట్రాక్టును నెల రోజుల పాటు పొడిగించడం జరిగిందని టీటీడీ వివరించింది.