కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారత్లో కరోనా మహమ్మారి మాత్రం అదుపులోకి రావటం లేదు. దేశంలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 40 వేల మార్కును దాటిపోయింది.
గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,553 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 42,533కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 11,707 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 29,453 మంది చికిత్స పొందుతున్నారు.
ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,373కి చేరింది. గరిష్టంగా నిన్న ఒక్క రోజులో 72 మంది రోగులు మృతి చెందటం ఆందోళనకరంగా మారింది.
అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే (12,296 కేసులు) నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ (5,055), ఢిల్లీ (4,122), తమిళనాడు (2,757), ఏపీ (1,583), తెలంగాణ (1,063), రాజస్థాన్ (2,772), యూపీ (2,626) రాష్ట్రాలున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.