కరోనా కట్టడి కోసం దాదాపు నెలన్నరగా కొనసాగుతున్న లాక్డౌన్ను కేంద్రం తాజాగా మూడోసారి కూడా పొడగించడంతో పాటు, ఇందులో కొన్ని సడలింపులను కూడా చేసింది. ఇందులో భాగంగానే దేశంలోని లిక్కర్ షాపులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా నేడు (మే 4) మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్లో కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం లిక్కర్ షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.
లిక్కర్ షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచుతారు. మద్యం విక్రయాలపై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. మద్యం ధరలు కూడా దాదాపు 25 శాతం పెంచుతున్నట్టు రజత్ భార్గవ స్పష్టం చేశారు. మద్యం కొనుగోలు చేయటానికి వచ్చే మందు బాబులు ఈ క్రింది నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
మందు బాబులు పాటించాల్సిన నియమాలు:
1. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చేవారు తప్పకుండా సామాజికదూరం పాటించాలి
2. షాపులో కి కేవలం 5 మందిని మాత్రమే అనుమతిస్తారు.
3. షాపుల ముందు సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తారు.
4. మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతి లేదు, క్యూ లైన్ లో కూడా ఉండనివ్వరు.
5. రద్దీ మరీ ఎక్కువ గా ఉంటే ఆ షాపులు కొంత సమయం మూసివేస్తారు.
6. బార్లను ఎట్టిపరిస్థతుల్లోనూ ఓపెన్ చేయకూడదు.
7. కంటైన్మెంట్ జోన్ బయట మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది.