కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో మే 29 వరకూ లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియని రేపటి (బుధవారం) నుంచి ప్రారంభిస్తామని కేసీఆర్ వెల్లడించారు.
పదవ తరగతి (టెన్త్) పరీక్షల విషయంలో హైకోర్టు నిబంధనలకు లోబడి నడుచుకుంటామని, వీలైనంత వరకూ మే నెలలో పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. పరీక్ష జరిగే తరగతి గదులను శానిటైజ్ చేస్తూ, పరీక్షలకు వచ్చే విద్యార్థులకు అవసరమైన మాస్కులు పంపిణీ చేసి, గదిలో 10 నుంచి 15 మంది విద్యార్థులు ఉండేలా భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని, ప్రైవేటు వాహనాలలో వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక పాసులు జారీ చేస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో మరిన్ని వివరాలను విద్యాశాఖ త్వరలోనే వెల్లడి చేస్తుందని చెప్పారు.