తెలంగాణ రాష్ట్రంలో అన్ని జోన్లలో (గ్రీన్, ఆరెంజ్, రెడ్) మద్యం అమ్మకాలకు కేసీఆర్ ఆనుమతులు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రేపటి నుంచి (బుధవారం) మద్యం దుకాణాలు తెరుస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో మద్యం దుకణాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఉంటుందని, ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మద్యం కొనుగోలు చేయవచ్చని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మద్యం విక్రయాలు ఉండవని తెలిపారు.
మాస్కులు లేని వారికి మద్యం విక్రయించకూడదని తెలిపారు. మరోవైపు మద్యం ధరలను కూడా పెంచుతున్నట్లు కేసీఆర్ వివరించారు. చీప్ లిక్కర్‌పై మాత్రం 11 శాతం, ఇతర బ్రాండ్లపై 16 శాతం ధరలను పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా ఇవే రేట్లు కొనసాగుతాయని కేసీఆర్ వివరించారు.
ఇకపోతే నగరంలో బార్లు, పబ్‌లు, క్లబ్‌లకు మాత్రం అనుతమి ఉండబోదని, మద్యాన్ని విక్రయించే వారు, కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఎవరైనా నిబంధలను అతిక్రమించినట్లు తెలిస్తే తక్షణమే సీజ్ చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.