ఏపీలో మందు బాబులకు మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కారు. మంగళవారం నుంచి మద్యం ధరలను అదనంగా మరో 50 శాతం పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ నుంచి మద్యం విక్రయాలకు సడలింపునిస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేయటంతో రాష్ట్రంలో సోమవారం ఉదయం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
అయితే, ప్రారంభ రోజునే మద్యంపై 25 శాతం ధరలను పెంచి విక్రయించారు. అయినా ప్రజలు ఏ మాత్రం తగ్గకుండా కీలోమీటర్ల మేర బారులు తీరి మద్యం కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో, కొనుగోళ్లను నియంత్రించేందుకు అదనంగా మద్యంపై మరో 50 శాతం ధరలను పెంచింది ఏపీ సర్కారు. దీంతో ఇప్పటి వరకూ రెండు రోజుల్లోనే మద్యంపై 75 శాతం ధరలు పెరిగాయి.
అంటే ఉదాహరణకు లాక్డౌన్కి ముందు రూ.100కి ధరకే మందుకు ఇప్పుడు రూ.175 అయినట్లన్నమాట. ఇలా ధరలను పెంచడం వలన మద్యం కొనుగోలు చేసే సామాన్యుల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీలో సోమవారం ఒక్కరోజే గరిష్టంగా రూ.45 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు అంచనా.