కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ కోసం దాదాపు నెలన్నర పాటు కొనసాగించిన లాక్‌డౌన్‌ను తాజాగా మరోసారి పొడగించడం, అయితే ఈసారి మద్యం దుకణాలకు మినహాయింపు ఇవ్వటంతో మందు బాబులు ఒక్కసారిగా దుకాణాలపై ఎగబడ్డారు. బెంగుళూరులో అయితే, ఏకంగా ఒక వ్యక్తి సుమారు రూ.53 వేల విలువైన మద్యం కొనుగోలు చేయటం ఇప్పుడు వివాదంగా మారింది.
బెంగళూరులోని వెనీలా స్పిరీట్ జోన్ నుంచి ఓ కస్టమర్ ఏకంగా రూ.52,841 విలువైన మద్యాన్ని కొనుగోలు చేయటం, ఇందుకు సంబంధించిన ఓ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సదరు షాపు ఓనర్‌పై ఎక్సైజ్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిమిత మోతాదుకు మించి విక్రయించడంపై ఈ కేసు నమోదు చేశారు.
ఒక రోజులో ఒక కస్టమర్‌కు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ 2.3 లీటర్లు, బీరు 18.2లీటర్ల కన్నా ఎక్కువ మొత్తంలో విక్రయించేందుకు రిటైల్ ఔట్లెట్లకు అనుమతి లేదు. కాగా.. ఈ కస్టమర్‌కు మాత్రం 17.4 లీటర్ల లిక్కర్, 35.7 లీటర్ల బీరును ఒకే బిల్లుపై విక్రయించారు. షాపు యజమాని మాత్రం మొత్తం 8 మంది కలిసి ఈ లిక్కర్ కొన్నట్లు చెబుతున్నాడు.