తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కొనసాగింపు, సడలింపులు ఇవ్వటం తదితర అంశాలపై దాదాపు 7 గంటల పాటు సాగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన మీదట తెలంగాణాలో మే 29 వరకు లాక్డౌన్ని పొడిగిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
కేంద్రం ఆదేశాల ప్రకారమే లాక్డౌన్ సడలింపులు ఉంటాయని, రెడ్ జోన్లలో మాత్రం నిత్యావసర వస్తువుల దుకాణాలు, కూరగాయల దుకాణాలు, రైతులకు సంబంధించిన దుకుణాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు మాత్రమే తెరచి ఉంటాయని వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులో ఉందని, లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణలో ఇవ్వాళ ఒక్క రోజే 11 కొత్త కేసులు నమోదు అయ్యాయని, 43 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 1,096కి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనాతో పోరాడి 628 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేసీఆర్ వివరించారు.