ఆంధ్రప్రదేశ్‌లోని సర్కార్ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, ఎవరైనా ఈ లిక్కర్‌ను వారం రోజుల పాటు సేవిస్తే వారికి పక్షవాతం రావటం ఖాయమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో మద్యం విక్రయాల్లో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు.
మొన్న 14 డిస్టిలరీలకు లిక్కర్ తయారు చేసుకోమని అనుమతినిచ్చారని, నిన్న లాక్ డౌన్ సడలించి 25శాతం ధరలు పెంచారని, ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాద్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెడతారా అంటూ సర్కారుకు ప్రశ్నలు సంధించారు.
అసలు తామెప్పుడూ వినని, చూడని బ్రాండ్ల పేర్లతో లిక్కరును విక్రయిస్తున్నారని, అసలు ఈ మద్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా అర్థం కావట్లేదని అన్నారు. చెత్తమందు తయారు చేసే డిస్టిలరీలను ప్రోత్సహించడమే కాకుండా, ఈ కల్తీ మద్యం రేట్లు పెంచటం మరింత దుర్మార్గమైన చర్య అని సోమిరెడ్డి విమర్శించారు.
మద్యం షాపులు తెరవడంతో ప్రజలెవ్వరూ భౌతిక దూరం పాటించకుండా దుకాణాల మందు బారులు తీరుతున్నారని, ఇది కరోనా వ్యాప్తిని పెంచుతుంది కాబట్టి లాక్డౌన్ ముగిసే వరకూ రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు మూసే ఉంచాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.