కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం వరుసగా మూడోసారి పొడగించిన లాక్డౌన్లో కేంద్రం కొన్ని సడలింపులు చేస్తూ అన్ని రాష్ట్రాల్లో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసినదే. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో మందు బాబులు చూపిన అత్యుత్సాహం ఇప్పుడు మద్యం విక్రయాలకు ఆటంకంగా మారింది.
దాదాపు నెలన్నర తర్వాత మద్యం విక్రయాలు ప్రారంభం కావటంతో కిక్కు ప్రియులంతా ఒక్కసారిగా షాపులపై పడ్డారు. కరోనా నిబంధనలు అతిక్రమించారు. భౌతిక దూరం పాటించకుండా వీపులు వీపులు రాసుకుంటూ కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడ్డారు. అసలే కరోనా ఎక్కువగా ఉన్న ముంబై నగరంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది.
దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ షాపులపై సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబైలో మద్యం షాపులను బుధవారం నుంచి మూసేస్తున్నట్టు ప్రకటించింది. ముంబై నగరంలో నిత్యవసర, మెడికల్ షాపులు మినహా అన్నింటిని బుధవారం నుంచి క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నెల 17 వరకు ముంబైలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.