విశాఖపట్నంలోని ఆర్.ఆర్. వెంకటాపురం వద్ద ఉన్న ఎల్.జి. పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదల విష వాయువు కారణంగా ఆస్పత్రి పాలైన ప్రజలను ఆదుకునేందుకు ఏపీ సర్కాకు మరొక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బాధితులకి అయ్యే మొత్తం ఆస్పత్రి ఖర్చులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెల్లించనుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం వలన, గ్యాస్ లీక్ బారిన పడిన బాధితులు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులలో ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. ఆరోగ్య శ్రీ తో అనుసంధానం అయిన హాస్పిటల్స్‌తో పాటు, అనుసంధానం కానీ హాస్పటల్స్‌లో కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని జవహర్ రెడ్డి తెలిపారు.
వైజాగ్ గ్యాస్ లీక్ బాధితులకి చికిత్స అందించిన ఆస్పత్రులు, పేషెంట్లకు సంబంధించిన ఆధార్ కార్డు, ఇతర వివరాలను మరియు చికిత్స అనంతరం వైద్య సేవల బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపాల్సి ఉంటుంది. వారి వైద్యం కోసం ప్రభుత్వం ఎంతైనా చెల్లించనుంది, ఇందుకు ఎలాంటి గరిష్ట పరిమితి లేదని వివరించారు.