విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హుటాహుఠిన వైజాగ్ చేరుకున్నారు. బాధితుల పరామర్శ అనంతరం ఆయన అత్యున్నత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన బాధాకరమని, బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటనకు కారణమైన ప్లాంట్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, బాధితులకు సాధ్యమైనంత మేర అధనపు పరిహారాన్ని కూడా వచ్చేలా చేస్తామని అన్నారు.
గ్యాస్ లీక్ ప్రభావం మొత్తం ఐదు గ్రామాలపై పడింది. ఈ ఐదు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని, బాధితులకు ఎల్జీ కంపెనీలోనే ఉద్యోగాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. చనిపోయిన వారిని తాను తిరిగి తీసుకురాలేను కానీ, వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ.. ప్రభుత్వం తరఫు నుంచి బాధితులకు భారీ స్థాయిలో నష్ట పరిహారాన్ని ప్రకటించారు సీఎం జగన్.
నష్టపరిహారపు వివరాలు:
– చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు
– వెంటిలేటర్ మీద ఉన్న వారికి 10 లక్షల రూపాయలు
– హాస్పిటల్ వార్డుల్లో ఉన్న వారికి లక్ష రూపాయలు
– ప్రథమ చికిత్సకు గురైన వారికి 25 వేల రూపాయాలు
– చనిపోయిన మూగజీవాల యజమానులకు 20 వేల రూపాయలు
– ఐదు గ్రామాల్లోని 15 వేల మంది ప్రజలకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు