వైజాగ్ ఎల్.జి. పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరవక ముందే ఛత్తీస్‌గఢ్‌లో మరొక గ్యాస్ లీకేజ్ ఘటన చోటు చేసుకుంది. రాయ్‌గఢ్‌లోని ఓ పేపర్ మిల్లులోని ట్యాంక్‌ను క్లీన్ చేస్తుండగా అందులో నుంచి గ్యాస్ ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మూడోసారి పొడగించిన ప్రస్తుత లాక్డౌన్లో పరిశ్రమలు సడలింపులు ఇవ్వటంతో దాదాపు నెలన్నర పాటు మూతపడిన ప్లాంట్లను ప్రస్తుతం పునఃప్రారంభిస్తున్నారు. నెలన్నర రోజుల ప్లాంట్లలో ఎలాంటి పర్యవేక్షణ లేని నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లులోని ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.