కరోనా మహమ్మారి కారణంగా అమెరికాతో సహా 12 ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన 15 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. దేశపు అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా సాయంతో నేటి (మే 7) నుంచి మే 13 వరకు 64 ప్రత్యేక విమానాలను నడిపి భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు.
రానున్న రోజుల్లో దశలవారీగా సుమారు 2 లక్షల మందిని భారత్‌కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. అమెరికాలోని నగరాల నుంచి ఇండియాకు రావటానికి సుమారు రూ. లక్ష, లండన్ నుంచి రూ. 50 వేలు, దుబాయ్ నుంచి రూ. 13 వేలు, ఢాకా నుంచి రూ. 12 వేలు టికెట్ ధరగా ఉండొచ్చని వివరించారు.
ఈ విమాన టికెట్ ధరలను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని సింగ్ స్పష్టం చేశారు. మే 7–13 మధ్య అమెరికా, బ్రిటన్, యూఏఈ, ఖతార్, సౌదీ, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, ఒమన్‌ల నుంచి 14,800 మంది భారతీయులను తరలించనున్నామని ఆయన వివరించారు.
కేరళకు అత్యధికంగా 15, ఢిల్లీ, తమిళనాడులకు 11 చొప్పున, మహారాష్ట్ర, తెలంగాణలకు 7 చొప్పున, గుజరాత్‌కు 5, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌లకు 3 చొప్పున ఎయిర్ ఇండియా లేదా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా విమానాలు నడపనున్నామని అధికారులు తెలిపారు.