లాక్డౌన్ కారణంగా తిరుమలకు భక్తులకు రాకపోయినప్పటికీ, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మాత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
మే 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.
వసంతోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బుధవారం నాడు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈఓ శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్ శ్రీ మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు.