కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం పాటిస్తున్న లాక్డౌన్ వలన ఎటొచ్చి ఎక్కువగా నష్టపోయింది వలస కూలీలే. చేయడానికి పనిలేక, చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి లేక, సొంత ఊరు వెళ్లడానికి రవాణా లేక వీరి అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడిప్పుడే మోడీ సర్కారు పుణ్యమా అని ప్రజలు సొంత ఊర్లకు బయలుదేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కానీ ఆ 16 మందికి మాత్రం కాలం కలిసిరాలేదు. సంతోషంగా సొంత ఊర్లకు వెళ్లాలనుకున్న వాళ్లు శవాలుగా వెళ్లాల్సి వచ్చింది. ఔరంగాబాద్‌లో జరిగిన ఓ ఘటన అందరనీ కలచివేస్తోంది. మధ్యప్రదేశ్‌లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు రైలు పట్టాలపై నడుచుకుంటూ గురువారం రాత్రి ఔరంగాబాద్‌కు చేరుకున్నారు. రాత్రి కావడంతో రైల్వే ట్రాక్‌పైనే నిద్రపోయారు.
అటుగా వెళ్తున్న గూడ్స్ రైలు వారిపై దూసుకుపోవటంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆ సమయంలో వారంతా గాఢ నిద్రలో ఉండిపోయారు. వారిలో మహిళలు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఔరంగాబాద్‌కు సమీపంలోని కర్మాద్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.