కరోనా లాక్డౌన్ వలన ఏపీలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జులై నెలలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ తెలిపారు. రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఒక వారం రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు, సిబ్బందికి సమస్యలు తలెత్తకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇందులో భాగంగా విద్యార్థుల మధ్య కనీసం 4 అడుగుల భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నామని , ఒక్కో గదిలో 12 నుంచి 15 మంది మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సురేష్ తెలిపారు.
విద్యార్థులు, సిబ్బంది అందరికీ మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటుచేస్తామని, తరగతి గదులను మరియు పరీక్షలు నిర్వహించే పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తామని వివరించారు.