కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా మార్చి 14 నుండి మే 31వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు రద్దు చేసుకున్న భక్తులకు త్వరితగతిన రీఫండ్ చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటి విభాగం కార్యకలాపాలపై ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను రద్దు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 45 శాతం మంది భక్తులు రీఫండ్ కోసం వివరాలు సమర్పించారని తెలిపారు. మొత్తం 2,50,503 మంది రీఫండ్ కోసం కోరగా 90 శాతం అనగా 1,93,580 మందికి వారి ఖాతాల్లో నగదు జమ చేశామని వివరించారు. మిగిలినవారికి కూడా త్వరగా చెల్లింపులు చేస్తామన్నారు. లాక్డౌన్ సడలించిన పక్షంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అమలుచేయాల్సిన విధి విధానాలపై మరోసారి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని అదనపు ఈవోను కోరారు.
గోవింద మొబైల్ యాప్‌లో శ్రీవాణి ట్రస్టును ఏప్రిల్ 9 నుండి అప్డేట్ చేసినట్టు తెలిపారు. ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లో కాగిత రహిత బిల్లులు రూపొందించాలని, పేపర్ ఆడిట్ చేపట్టాలని, గతేడాది కంటే 50 శాతం కాగితం వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అదేవిధంగా, పిఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్, విజిలెన్స్ కంప్లైంట్స్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్, ఈ-పేమెంట్స్ ఇమ్మిగ్రేషన్, స్టూడెంట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, లీజ్ రెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తదితర అప్లికేషన్లపై ఈవో సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవో (రెవెన్యూ మరియు పంచాయతి) శ్రీ విజయసారథి పాల్గొన్నారు.