ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములకు తెలంగాణా పారిశుధ్య కార్మికులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో తమకు పాలు, మజ్జిగ వంటి రిఫ్రెష్మెంట్స్ పంపిణీ చేసినందుకు గానూ శేఖర్ కమ్ములకు జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్నంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ప్లకార్డులపై ‘థాంక్యూ శేఖర్ కమ్ముల గారు’ అంటూ ఇంగ్లిషులో రాసి ఉంది. గాంధీ ఆస్పత్రి వద్ద జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులు ఈ ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీనిపై శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. ‘గాంధీ ఆసుపత్రి జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులు నాపై ప్రేమను చూపించిన తీరు అమూల్యం. ఇది నాకు లభించిన అతి పెద్ద అవార్డు. నా పని మీ హృదయాల్ని తాకడం అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. కానీ మీరు మా కోసం నిరంతరం శ్రమిస్తున్న దాని ముందు ఇది చాలా చిన్నది’ అంటూ పోస్ట్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా చేపట్టిన లాక్డౌన్ కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, కొందరు దాతలు స్వచ్ఛందంగా వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. అలానే, శేఖర్ కమ్ముల కూడా ఒక నెల రోజుల పాటు నార్త్ జోన్ పరిధిలో పనిచేస్తున్న వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించారు.