ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పని నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న కూలీల పాలిట కరెంటు తీగలు యమపాశాలుగా మారాయి. మిర్చీ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఓ కరెంటు స్తంబాన్ని డీకొట్టడంతో కరెంటు తీగలు వారిపై పడ్డాయి. కరెంట్ షాక్ తగలడంతో పలువురు అక్కడికక్కడే మృతిచెందారు.
జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలోని మాచవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది కూలీలు అక్కడికక్కడే మరణించగా , ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10కి చేరింది.
ఘటనా సమయంలో ట్రాక్టరులో సుమారు 30 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. వీరంతా సమీపంలోని మిరప తోటలో మిరపకాయలు కోసి ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో తొమ్మిది మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలు:
1. పీకా కొటేశ్వరమ్మ (50)
2. నుకతోటి లక్ష్మే (65)
3. కాకుమాను రమాదేవి (55)
4. కాకుమాను కుమారి (45)
5. కాకుమాను రాణిశ్రీ (40)
6. గోళ్ళ రవి శంకర్ (20)
7. కాకుమాను శివ (17)
8. కాకుమాను మౌనిక (18)
9. కాకుమాను అమూల్య (18)