కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం విధించిన లాక్డౌన్ వ్యవధి క్రమక్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను మార్కెటింగ్ చేసుకోవటం సినీ నిర్మాతలకు కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, తన చిత్రాలను నేరుగా టెలివిజన్లలోనే విడుదల చేసేందుకు గాను చిత్ర దర్శక నిర్మాతలు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు.
తాజాగా.. మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్’ సినిమాను కూడా నేరుగా పాపులర్ ఓటిటి ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జూన్ 19 నుండి ప్రైమ్ వీడియోలో లాంచ్ చేయనున్నారు. ఆసక్తికర కథ, కథనంతో సాగిపోయే ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించగా స్టోన్ బెంచ్ ఫిల్మ్ పతాకంపై కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించారు.
ఇప్పటికే తెలుగులో ‘అమృతరామమ్’ అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాగా, తమిళంలో జ్యోతిక లీడ్ రోల్లో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా, హిందీ చిత్రం లక్ష్మీ బాంబ్ కూడా ఓటిటిలో రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం.