కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన లాక్డౌన్ కారణంగా గడచిన రెండు నెలలు తిరుమల దేవస్థానంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేయటంతో ఆలయ ఆదాయానికి భారీ గండి పడింది. అయితే, ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు తమ కానుకులను ఆన్లైన్ హుండీ ద్వారా చెల్లించుకున్నారు.
భక్తులు శ్రీవారి దర్శన భాగ్యానికి నోచుకోక పోయినప్పటికీ, తమ కానుకలు మాత్రం యథావిధిగా సమర్పించుకుంటున్నారు. తితిదే ఆన్లైన్ వెబ్సైట్లు, గోవిందం యాప్ ద్వారా తమ కానుకలను ఆన్లైన్ హుండీలో జమ చేస్తున్నారు. గడచిన సంవత్సరం సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో ఆన్లైన్ హుండీ కానుకలు రూ.90లక్షలు జమ కాగా, లాక్డౌన్ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా దాదాపు అంతే మొత్తంలో జమ కావటం విశేషం.
ఇక భౌతికంగా చూసుకుంటే.. తిరుమలలో భక్తులకు ప్రవేశం లేకపోయినప్పటికీ, అక్కడి అధికారులకు మరియు కొందరు ఉద్యోగులకు తిరుమల పైకి అనుమతి ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, అప్పుడప్పుడూ తిరుమలకు వస్తున్న కొందరు తితిదే సభ్యులు, ఉద్యోగుల ద్వారా కూడా ఆలయ ప్రధాన హుండీలో ఎంతో కొంత ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం.