దేశవ్యాప్తంగా కలకలం రేపిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ఏపీ సర్కారు శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో నిల్వ ఉన్న మొత్తం స్టైరిన్ గ్యాస్‌ను వైజాగ్ నుంచి దక్షిణ కొరియాకు పంపే ప్రక్రియ పూర్తయ్యింది.
ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి కారణమైన స్టైరిన్ రసాయనం పూర్తిగా విశాఖ నుంచి తరలించామని కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. ఐదు రోజుల క్రితం స్టైరిన్ రసాయనం నిండిన నౌక దక్షిణ కొరియాకు బయలుదేరింది. మిగిలిన స్టైరిన్‌తో కూడిన మరో నౌక సోమవారం ఉదయం 6:45 నిమిషాలకు విశాఖ రేవు నుంచి తరలివెళ్లిందని ఆయన వివరించారు.
దీంతో ఇప్పటి వరకూ పోర్టులో అలాగే కంపెనీలో నిల్వ ఉన్న మొత్తం స్టైరిన్‌ను పూర్తిగా దక్షిణకొరియాకు పంపించినట్లయిందని చెప్పారు. ఇదిలా ఉంటే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీక్ ప్రమాదంపై రాష్ట్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ రేపు (బుధవారం) నగరానికి చేరుకోనుంది.
రాష్ట్ట్ర అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఆరుగురు సీనియర్ అధికారులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు తొలుత ప్లాంటును, ఆ తర్వాత బాధిత గ్రామాల్లోను పర్యటించి ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారు. కమిటీ నివేదిక అనంతరం ఏపీ సర్కారు తదుపరి నిర్ణయాలను ప్రకటించే ఆస్కారం ఉంది.