కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వరుసగా నాలుగోసారి లాక్డౌన్ను పొడగించిన నేపథ్యంలో, వివిధ రాష్ట్రాలలో పాటించాల్సిన కొత్త మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలేశారు. ఇందులో భాగంగానే, ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నివారణ, సహాయక చర్యల తీరుతెన్నులపై సమీక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఈ కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సరికొత్త మార్గదర్శకాలను అనుసరిస్తూ, రాష్ట్రంలో అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాలను వివరించారు.
ఇకపై రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరచి ఉంటాయి. కారులో డ్రైవరుతో పాటు ముగ్గురు ప్రయాణించవచ్చు. పెళ్లిళ్లకు 50 మందికి మా త్రమే అనుమతి ఉంటుంది. రెస్టారెంట్లలో భోంచేయడం వీలుకాదు కానీ, రెస్టారెంట్ల నుంచి పార్శిల్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ప్రతి దుకాణంలో తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలి.
ఎప్పటిలాగే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.