ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటిటి (ఓవర్ ది టాప్) వచ్చాక చిన్న సినిమాలు తీసేవారంతా ఈ ప్లాట్‌ఫామ్‌నే ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్‌లు తీసేవారి సంఖ్య మాత్రం ఎక్కువగా పెరిగింది. సాధారణ సిల్వర్ స్క్రీన్ సినిమాకి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే వెబ్ సినిమాలను చాలా తక్కువ బడ్జెట్‌తో చిత్రీకరించవచ్చు.
పైపెచ్చు ఇలాంటి వెబ్ సినిమాలకు పెద్దగా ప్రచారాలు చేయాల్సిన అవసరం కూడా లేదు, కంటెంట్ ఉంటే ఇట్టే క్లిక్ అయిపోయి, ఇంటర్నెట్లో మాంచి పాపులారిటీని దక్కించుకుంటాయి. తాగాజా.. యాక్టర్ నవీన్ చంద్ర, సలోని లుథ్రా, రాజా చెంబోలు, హర్ష ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ ఫిల్మ్ ‘భానుమతి రామకృష్ణ’ కూడా ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను టచ్ చేయనుంది.
శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ ఫిల్మ్ మూవీ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. భానుమతి పాత్రలో సలోని లుథ్రా, రామకృష్ణ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తుండగా, వీరిరువురి నడుమ చిగురించిన ఓ అందమైన ప్రేమకథతో ఈ వెబ్ సినిమాని చిత్రీకరించారు.
నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కృశివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా… అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించారు. కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చారు.